ఓంకారమంటే ఇంతేనా?
రోడ్డు మీద ఒక కారు వెడితే శబ్ధం వస్తుంది. నీటి పైన ఒక నావ వెడితే శబ్దం వస్తుంది. నేల పైన మనం నడిస్తే శబ్దం వస్తుంది. ఆకాశంలో ఒక విమానం వెడితే శబ్దం వస్తుంది. మరి ఇంత పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలు అతివేగంగా విశ్వమంతా సంచరిస్తుంటే శబ్దం రాదా? పెద్దపెద్ద అణు బాంబుల సముదాయాలైన నక్షత్రాలు నిరంతరంగా పేలిపోతూ ఉంటే …. శబ్దం రాదా? ఈ అనంత విశ్వమంతా శబ్ద తరంగాలతో హోరెత్తిపోదా? ఎందుకు రాదూ? వస్తుంది! మనమే వినలేక పోతున్నాము! అదే మన పెద్దలు చెప్పిన ఓం కార నాదం అయివుండొచ్చు. ఇది ఇలా చెబితే చాలా సామాన్యమైన విషయంగా అనిపించి; అర్థం చేసుకోడానికి మరీ సులభంగా తోచి; ఆ భావనలో ఆధ్యాత్మికత కొంచెం లోపించి… …. అదేమీ కాదు అని తేలిగ్గా కొట్టి వేయకుండా .... సైన్సు ఏమి చెబుతోంది, శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో ఒక్క సారి పరిశీలిద్దాం. సమజసం అనిపిస్తే దృవీకరిద్దాం. లేకుంటే పరిశోధనలు ఇంకా కొనసాగిద్దాం…
ఈ అన్వేషణ ప్రారంభించే ముందు ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త, “ నికొలాస్ టెశ్లాని “ ఈ సంధర్భంగా స్మరించుకోవాలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. పైగా ఈ జులై మాసం ఆయన పుట్టిన నెల కూడా! నికోలాస్ టెశ్లా (జులై 10, 1856 – జనవరి 7, 1943) ఆధునిక మానవ నాగరికతను మనకు అందించిన మహనీయుడు అంటే, అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఒక మెకానికల్ ఇంజినీరుగా, ఒక ఎలక్ట్రికల్ ఇంజినీరుగా జగద్విఖ్యాతి గాంచిన ఇతడే, మనం అనుదినం వాడుకునే ఆల్టర్నేటింగ్ కరెంట్‌ని కనిపెట్టిన మేటి విశ్వామిత్రుడు. రేడియోని మార్కోనీ కనుగొన్నాడన్న విషయం అందరికీ తెలిసినదే అయినా, అమెరికన్ పేటెంట్స్ మాత్రం ఆ ఘనత ఇతడికే ఆపాదిస్తోంది. సరే ఆ విషయం కొంచెం వివాదాస్పదంలే అని పక్కకు పెట్టినా; 700 పైగా పేటెంట్లతో, 1500పైగా ఇన్వెన్షనులతో, అతడు కనుగొన్న ఎ.సి మోటార్లు, ట్యూబులైట్లు, స్టీము టర్బైనులు, మాగ్నటిక్ ఫీల్డు పైన అతడి పరిశోధనలు; అతడు వైర్‌లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ పై కనుగొన్న టెశ్లా ఎఫెక్ట్; అలాగే అతడు పరిశోధనలు జరిపిన రిమోట్ కంట్రోల్ పరిజ్ఞానం, రోబోటిక్స్, న్యూక్లియర్ ఫిజిక్సు, కంప్యూటర్ సైన్సెస్ రంగాలు ….. ఇలాంటివి ఒకటి కాదు; ఎన్నో పరిశోధనలు … వెరసి అతడి విజ్ఞానం నేడు మరింత అభివృద్ధి చెంది మానవాళికి ఉపయోగపడుతూ వస్తోంది.
యుగస్లావియాలో పుట్టి, జెర్మనీ ఫ్రాన్స్ దేశలలో పనిచేసిన తరువాత; 1884లో తను పనిచేస్తున్న కంపెనీ యజమాని దగ్గిరనుంచీ ఒక రికమండేషన్ లెటర్ తీసుకొని అమెరికా ప్రయాణమయ్యాడు టెశ్లా. ఆ లేఖ ఆ నాటి పరిశోధకులలో అతిపెద్ద దిగ్గజమైన థామస్ ఎడిసన్‌ని సంభొదిస్తూ ఇలా వ్రాసి వుందట .... "నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇద్దరే మేధావులు వున్నారు. మొదటిది నీవు! రెండవది ఈ నికోలాస్ టెశ్లా" అని వ్రాసి వున్నదట. అది చూసి ఎడిసన్ మహాశయుడు వెంటనే టెశ్లాని ఉద్యోగంలోకి తీసుకున్నాడట. కానీ ఎడిసన్ టెశ్లాలు ఇద్దరూ ఆ లేఖలో చెప్పినట్లుగా మహా మేధావులు అవ్వడం వల్ల, ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు, వారిద్దరి మద్య కలిగిన విభేదాల వల్ల, టెశ్లా వేరొక ఉద్యోగ చూసుకోవలసి వచ్చింది. వెంటనే ఎడిసన్ కనుగొన్న డైరెక్ట్ కరంట్‌కి ప్రత్నామ్యాయంగా, టెశ్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ ని కనుగొన్నాడు. అది ప్రపంచాన్ని వెనువెంటనే పూర్తిగా మార్చివేయడంతో టెశ్లాకి ఇక తిరుగులేకుండా పోయింది. ఆ తరువాత ఎన్నో కొత్త పరిశోధనలు జరిపి అనేక విషయాలు అతడు కనుగొనడం అందరికీ తెలిసిందే.
Niagara Falls, The first three alternating current generators to go online, 1896
కానీ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే అతడికి 1898లో రేడియో పైన ఆశక్తి కలిగిందట. ఫలితంగా జె.పి.మోర్గాన్ పెట్టుబడితొ లాంగ్ ఐ లాండులో ఒక వైర్‌లెస్ టవర్‌ని నిర్మించాడు. కానీ మోర్గాన్‌తో కూడా విభేదాలు వచ్చి ఆ ప్రాజెక్ట్ విరమించుకొని మళ్ళీ కొలరాడొ స్ప్రింగ్స్ లో మొదలు పెట్టాడు. ఇక్కడ అతడు చేసిన అనేక పరిశోధనలలో విచిత్రమైనది ఒకటి ఇప్పుడు మనం గమనించ వలసి వుంది.
Colorado Springs Lab
ఈ కొలరాడో అధ్యయనంలో విశ్వాంతరాళాల నుంచీ వచ్చే రేడియో ప్రసారాలను విశ్లేషణ చేయడమే ముఖ్యమైన అంశం. భూమి పైన మనం ఇంత అభివృద్ది సాధిస్తే, విశ్వంలోని ఏ మూలలో నైనా మరొక్క జీవి వుండకపోతాడా?; మరొక్క నాగరికత వుండకపోతుందా?; అన్న చిగురంత ఆశ, ఆసక్తి ఈ పరిశొధనలకు మూలం. ఒక వేళ అలా ఎవరైనా వుంటే, ఏదో ఒక రేడియో సంకేతం మనకు అందక పోతుందా అన్న తపన. అలా నలుమూలనుంచీ వచ్చే రేడియో తరంగాలనూ శోధించి విశ్లేషించడమే వీరి ఉద్యోగం. ఇలా చేసిన ఈ పరిశోధనలో వీరికి ఏ సంకేతం అందలేదు గానీ, ఎప్పుడూ ఒక రేడియో డిస్ట్రబెన్స్ (శబ్దం) వచ్చేదట. అది వారి పరికరాల నుంచీ వచ్చిందేమో అని చూస్తే అది కాదని తేలిందట; అలాగే అది ఏమైనా తుఫానుల వలనో లేక అసంకల్పితంగా మానవుల వలన కలిగిన సంకేతాలేమోనని పరిశీలిస్తే అవికూడా కావని తేలిందట. మరింతగా పరిశీలిస్తే ఇది సాధారణ రేడియో డిస్టర్బెన్స్ కాదు, భూమి వెలుపల నుంచి వచ్చే రేడియో తరంగాలే అని తేలిందట. సరే ఇది వేరే గ్రహ వాసులు పంపే సంకేతం అని అనుకుందామా అంటే ఒకే ధ్వని నిరంతరంగా నిర్విరామమంగా వస్తోందట. అందుకని అది ఒక సంకేతం కూడా కాదని తేలిందట. ఇది ఒక హమ్మింగ్ శబ్దంలాగా వినిపిస్తోందట “ఈ అనంత విశ్వంలో భూమి తిరుగుతూవుండడం వల్ల వచ్చే శబ్దం “ అని ఈతడు దీనిని వ్యవహరించాడు. కానీ టెశ్లాని ఎవరూ లెక్కచేయలేదు. ఐనా టెస్లా ఈ గ్రహాంతర తరంగాల పైనే పరిశోధనలు చేస్తూ కుజ గ్రహం పై ఎవరైనా వుంటే వారితో సంభాషణలు జరపాలని; ఆ గ్రహం పైననే తన దృష్టిని కేంద్రీకృతం చేస్తూ; అటు రేడియో తరంగాలను పంపుతూ, అటు నుంచీ వచ్చే తరంగాలను పరిశీలిస్తూ తన శేష జీవితం గడిపాడట.
మళ్ళీ కార్ల్ జెన్‌స్కీ అనే మరొక శాస్త్రవేత్త ఇదే అంశం పై 1935లో పరిశోధన జరిపి ఈ హమ్మింగ్ శబ్దం నిజమేననీ, అది మన భూభ్రమణం వల్ల మాత్రమే కాదనీ, అది విశ్వమంతా వ్యాపించివుందని; విశ్వం మద్యభాగం నుంచీ మరీ ఎక్కువ వస్తోందనీ అని అతడు నిర్ధారించాడు.
జులై 3, 1935, నిజంగా చరిత్రలో చెప్పుకోదగ్గరోజే! ఆనాడు “ మిచిగన్‌లో నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రేడియో ఇంజినీర్స్” లో జన్‌స్కీ తన పరిశొధనా పత్రాన్ని సమర్పించాడు. జెన్‌స్కీ వివరణతో విశ్వమంతా ఒక శబ్ధం ఆవరించివుందని ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ శబ్దం కేవలం భూభ్రమణం వల్ల మాత్రమే వచ్చింది కాదు, విశ్వంలోని సకల గ్రహాలూ, నక్షత్రాలూ, ఒకటేమిటి అన్నీ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ, కదులుతూ, విస్ఫోటనలు చెందుతూ వుండటంచేత వాటివల్ల వచ్చే శబ్దమేనని మనం అనుకోవచ్చును. అంతేకాదు విశ్వం మద్యభాగం నుంచీ ఎక్కువ వస్తోందీ అంటే, అవి బిగ్ బాంగ్ నుంచీ విడుదలయ్యిన తరంగాలే అని కూడా తెలుస్తోంది. సరే ఇది శబ్దమే ఐతే, మనం ఎందుకు వినలేక పోతున్నాం?
మానవుడు 20 నుంచీ 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీల మద్యనున్న శబ్ద తరంగాలను మాత్రమే వినగలడు. ఇన్‌ఫ్రా సౌండ్‌ని, అంటే 20 హెర్ట్జ్లకన్నా తక్కువ ధ్వనులని మనం వినలేము, కానీ స్పర్శించగలము (అదికూడా ఆంప్లిట్యూడ్ పెద్దగా వుంటేనే). అల్ట్రా సౌండ్లని, అంటే 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ వున్న ధ్వనులని కూడా మనం వినలేము. వీటి పై నుంచి 3 గిగా హెర్జ్ల వరకూ వుండే తరంగాలని రేడియో తరంగాలంటాము. దాని పైన 3 నుంచీ 300 గిగా హెర్ట్జ్ దాకా వుండే వాటిని మైక్రోవేవ్‌స్ అంటాము. ఆ పైన ఇన్‌ఫ్రా రెడ్, ఇంకా పైన కాంతి తరంగాలు, దానికి పైన అల్ట్రా వైలెట్లు, ఎక్స్-రేలు, గామా రేడియేషన్లు వగైరాలు.
శబ్ద తరంగాలు వస్తువు లేక కణాల కదలిక వల్ల ఏర్పడతాయి. వాటికి గాలి వంటి వాహకం ఒకటి కావాలి. మన విశ్వమంతా శూన్యమై వుండటం వల్ల, వాహకం దొరకక ఆ శబ్దం నశించిపోతుంది. అలాగే చార్జి వున్న కణాల కదలిక వల్ల రేడియో తరంగాలు ఏర్పడతాయి. సృష్టిలోని ప్రతి నక్షత్రం నుంచీ (ప్రతి అణు విస్ఫోటకం నుంచీ), చార్జి ఉత్పన్నమౌతుంది. ఈ రేడియో తరంగాలకు వాహకం అక్కరలేదు. కనుక ఇవి విశ్వమంతా వ్యాప్తి చెంద గలుగుతాయి. తొలుత వచ్చిన బిగ్ బాంగ్ నుంచీకూడా రేడియో తరంగాలు ఉత్పన్నమైనాయి. అవి ఇంకా మన విశ్వమంతా పాకివున్నాయి. టెశ్లా విన్న హమ్మింగ్ లేక హిస్సింగ్ తరంగాలు (రేడియో తరంగాలు) ఈ తాలూకువి. అందుకని సాధారణ మానవుడు ఈ శబ్దాన్ని వినలేడు. (ఒక వేళ వినగలిగితే అంత శబ్దాన్ని మనం విని భరించగలమా?). నిజానికి మనం ఏ రేడియో ఫ్రీక్వెన్సీనీ వినలేము. కానీ ఈ శబ్దాన్నే మన యోగులు మాత్రమే గ్రహించగలిగారని మనం అనుకుంటున్నామేమో? దానినే మనం ఓంకారమని పిలుచుకుంటున్నామేమో? ఆలోచించండి!?
------- ------- -------
ఓంకార బిందు సంయుక్తం,
నిత్యం ధ్యాయంతి యోగినః,
కామదం మోక్షదం తస్మా,
ఓంకారరాయ నమోనమః
ఈ టెశ్లా విన్న హిస్సింగ్ లేక హమ్మింగ్ శబ్దాన్ని, ఓంకార నాదం అని మనం ఎలా అనుకోగలం? మన హిందువులు ఈ ఓంకారాన్ని ఎలా నిర్వచిస్తున్నారు? ఓంకారమంటే ఇది, ఓంకారమంటే అది, ఓంకారమంటే సర్వస్వం అని అనేక భాష్యాలలో, గోష్టులలో మనం చిన్నపట్టి నుంచీ వింటూనే వచ్చాం. ఏదో అర్థమయ్యినట్లు తలలూపుతూనే వచ్చాం. ఉదాహరణకు, "ప్రణవోహి పరబ్రహ్మా - ప్రణవః పరమం పదం; ప్రణవం సర్వవేదాద్యం - సర్వదేవ మయం విదుః" ప్రణవమే పరబ్రహ్మము. ప్రణవమే ముక్తి, ప్రణవమే సర్వవేదాలకు మూలం. ప్రణవమే సకల దేవతల మయమైనది. కాబట్టి "అనయా సదృశీ విద్యా - అనయా సదృశీ జపః అనయా సదృశం పుణ్యం - న భూతో న భవిష్యతిః. " ఓంకారంతో సమానమైన విద్య లేదు. దానితో సమానమైన జపం లేదు. దానితో సమానమైన పుణ్యము కూడా మరొకటి లేదు. “యద్వా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవః”. ఈ ప్రణవం దేవాత్మకమగు బ్రహ్మమునకు (లేదా బ్రహ్మాండమునకు) చెందునది. “ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయతీ త్యేతస్మాత్ ప్రణవః” – సర్వ ప్రాణములను పరమాత్మయందు లగ్నము చేయునది అని కూడా ప్రణవమునకర్థం. “సర్వేభ్యో దుఃఖ భయేభ్యః సంతారయతీతి తారణా త్తారః” అని సర్వవిధములయిన దుఃఖముల నుండి, భయముల నుండి కూడ రక్షింపగల్గినది కాబట్టి దీనిని తారం అని కూడా అంటారు. ప్రణవాన్ని తారా స్వరూపంగా (జగజ్జనని ఐన అమ్మవారిగా) కూడా పూజిస్తారు. “ఓంకార పంజరశుకీం” అని అమ్మవారిని ఓంకారమనే పంజరంలో చిలుకగా కూడా చెబుతారు .
ఈ రకంగా చెబితే, చెప్పేవాళ్ళకు తెలుసునేమోగానీ, వినేవాళ్ళకు చాలా మటుకు పూర్తి అవగాహన లోపిస్తుంది. అప్పుడు దాన్ని వారి అజ్ఞానంగా కొట్టివేస్తాం. నిజానికి ఓంకార స్వరూపం అంత క్లిష్టమైనదా? లేక పూర్తిగా అర్థంకాక మనకు మనమే దానిని కాంప్లికేట్ చేసుకుంటూ వస్తున్నామా? ఓంకారానికి మన పెద్దలు ఇచ్చిన నిర్వచనాలన్నీ మళ్ళీ ఒక సారి సరిగ్గా చూద్దాం. ఆ తరువాత ఇది టెస్లా విన్న శబ్దమా కాదా అని మళ్ళీ పరిశీలిద్దాం. రెండూ ఒకటే ఐతే మనం ఓంకారాన్ని దర్శించు కోగలిగిన వారలం అవుతాం.
1. ఉపనిషత్తుల నిర్వచనం :
సృష్టికి పూర్వమున్నది ఒక మహాబిందువు (“సదేవసోమ్యేదమగ్ర ఆసీత్ - ఛాం -6-2-1”). సృష్టికి ముందు సత్ అను పదార్థము ఉండేదట. ఇదే చిదగ్నిగా ఉపదేశింపబడిన బ్రహ్మ పదార్థము. ఇదే మొట్టమొదటి మహాబిందువు. “తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి” (ఛాం- 6-2-3) - మొదటి సత్ పదార్థము అనేకముగానగుదును అని సంకల్పించినది. అట్టి ప్రధమ సంకల్పితసహితమయిన (ఈక్షత్యాత్మక) మహాకారణ శక్తి యొక్క క్షేత్ర రూపమునకే (Geometric Figure) శ్రీచక్రము అని వ్యవహార నామము. ఈ బిందువు మన సైన్స్ చెబుతున్న బిగ్ బాంగ్‌కి పూర్వమున్న మాటర్‌లెస్ స్టేట్‌నే వర్ణిస్తోంది.
2. పురుషసూక్త నిర్వచనం :
“సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్ర పాత్ |
స భూం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ||” (పురుష సూక్తం)
ఈ శ్లోకం ఒక మహా బిందువు నుండి పుట్టిన మొదటి వృత్త లక్షాణన్ని వర్ణిస్తుంది. శీర్షము అంటే శిరస్థానీయ బిందువు (“vertex”). వృత్త పరిది పై ప్రతి బిందువూ శిరస్థానీయ బిందువే అవుతుంది! అట్టి అనంత బిందువుల సముదాయమే సహస్రశీర్షతత్వం. అక్షము అంటే సౌష్టవ రేఖ (“axis of symmetry” or “The line of diameter”). వృత్తమందు అక్ష రేఖలు అనంతం. ఇదే సహస్రాక్షతత్వం. అలాగే “పాత్” అనగా భుజములు. “సహస్రపాత్” అంటే అనంత బహుభుజి (“polygon of infinite sides”). వృత్త పరిధి పై నున్న ప్రతి బిందువు ఒక భుజమే అవుతుంది. అందుకే దాన్ని సహస్రపాత్ అని వర్ణించవచ్చు. అంటే సహస్ర శీర్ష, సహస్ర భుజ, సహస్ర పాత్ .. ఇవి అన్నీ వృత్త లక్షణాలే. అంటే ఆ మహా బిందువు చుట్టూ ఒక వృత్తాకారం తయారయ్యిందట. వృత్తం అనకుండా వృత్తానికి సంబంధించిన ఈ లక్షణాలు చెప్పడానికి కూడా ఒక కారణంవున్నట్టు అనిపిస్తుంది. అనంతమైన శీర్షాలు, అనంతమైన భుజాలు అన్నమాటలబట్టి ఈ వృత్తం ఒక తరంగపు ఆకారంలో వ్యాపిస్తోంది అనికూడా గ్రహించవచ్చు. క్రింది చిత్రపటం చూడండి. వ్యాపించే వృత్తాలు కనుక వాటిని నునుపుగా చూపలేదు. తరంగాల మాదిరి చూపడం జరిగింది. అవి అనేక బిందువులతో, లేక అనేక శీర్షాలతో, అనేక భుజాలతో వృత్తాకారంలో వ్యాపించే తరంగములు . అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం, బిందువునకు సంకేతం సున్న, వృత్తానికి సంకేతం 9. రెంటికీ కలిపి సంకేతం 10 అవుతుంది. వెరసి దశాంగులత్వం అవుతుంది.

“సజాతో అత్యరిత్యత | పశ్చాద్ద్భూమిమధోపురః”||
మొదటి వృత్తము నుండీ, “సజాతః” అంటే దానినుండీ పుట్టి; లేక దానిపైనే కేంద్రములు కల్గి; లేక ఒకే వ్యాసము కలిగి; లేక అదే పరిమాణము కలిగి; ఇక్కడ ఆ అన్ని గుణాలూ ఉన్న మరో నాలుగు వృత్తాలు, నాలుగు వైపులా, మొదటి బిందువునుంచే పుట్టాయి.
“సప్తాస్యాన్ సప్త పరిధయః | త్రిసప్త సమిధః కృతాః ”||
తరువాత ఈ ఐదు వృత్తాలమీదుగా 7 పరుధులు, 21 బిందువులతొ (త్రిసప్త) రూపొందిన యంత్రమే శ్రీచక్రము. మొదటి వృత్తపు (అంతర వృత్తపు) అంచుల పైన నాలుగు దిక్కులలో నాలుగు సజాతి వృత్తాలు. ఆ నాలుగు వృత్తాల ఉపరితలం పై మరొక బాహ్యవృత్తం. బాహ్య అంతర వృత్తాల మద్యగా మరొక మద్యవృత్తం. వెరసి ఇవి 7 వృత్తాలు, 21 ఇంటర్‌సెక్టింగ్ బిందువులు అవుతాయి. పురుషసూక్తంలో శ్రీచక్ర వివరణ ఇలా సాగుతుంది. అంటే మొదట వ్యాప్తిచెందిన బిందువు ఈ రూపంతో మొదలయ్యిందట. అక్కడనుంచీ అనేకంగా పరిణితిపొందినదట. ఇది చూస్తే మన బిగ్ బాంగ్ థియరీ జ్ఞప్తికి రావడంలేదూ? Ever Expanding Universe" అన్న మాట గుర్తుకురావడంలేదూ?
3. ఓంకారం నుంచే అన్నీ పుట్టాయి:
పైన చెప్పినట్లు తొలుత విశ్వంలో ఒక బ్రహ్మాండం (బ్రహ్మ+అండం) తయారయ్యింది. బ్రహ్మాండం ఒక మహా సూక్ష్మ బిందువట. బ్రహ్మాండన్ని ఎవరు తయారు చేసారు అన్న ప్రశ్నకి -- ఆధ్యాత్మికంగా చూస్తే దాని సమాధానం భగవంతుడే అవ్వచును (లేక భగవంతుడే ఈ అండమయి వుండవచ్చును); సైన్సు పరంగా చూస్తే సమాధానం ఇంకా తెలియదు. ఏది ఏమైనా బ్రహ్మాండం అనేది ఒకటి తయారయ్యిందని, అది ఒక అనిర్వచనీయమైన, అనంతగురుత్వాకర్షణ కలిగిన, అతి సూక్ష్మ, బ్లాక్ హోల్ అని, అది పేలిందని, దానినే బిగ్ బాంగ్ అని అనవచ్చుననీ, పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా మన ఉపనిషత్తుల పురుషసూక్త నిర్వచనాలతో ఏకీభవించిన విషయం విదితమే. ఈ బ్లాక్ హోల్ నుంచీ, ఏ పరమాణువు గానీ శబ్దతరగాలు గానీ చివరికి కాంతికిరణాలు కూడా తప్పించుకోలేవనీ, దాని బయట వేరే మరే మాటర్ వుండే ప్రసక్తి లేదని కూడా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. మన శాస్త్రాలు ఆ బ్రహ్మాండాన్ని (ఆ బ్లాక్ హోల్‌ని) పైవిధంగా ఒక బిందువుతో పోల్చారని వడ్లుమూడి వేంకటేశ్వర రావు గారు శ్రీచక్రదర్శనం లో చెప్పారు. ఆ బిందువు అనేకంగా అవ్వలని తలచిందట, దానితో ఒక విస్పోటన జరిగి విశ్వసృష్టి జరిగిందట. ఇంతవరకూ అంతా నిర్వివాదాంశమే!
ఆ బ్రహ్మాండం బద్దలవ్వడానికి ముందున్నది కేవలం నిశ్శబ్దం. బ్రహ్మాండం బద్దలయ్యి… ఆ శబ్దంలో ఈ విశ్వసృష్టి మొదలయ్యింది. ఆ పేలుడికి కదలడం మొదలుపెట్టిన ప్రతి అణువూ, గ్రహమూ, నక్షత్ర సమూహాలు ఇంకా అతి వేగంగా కదులుతూనే వున్నాయి. అలా కదులుతూనే వుంటాయి. ప్రతి కదలికకి ఒక ధ్వని వస్తుంది. ఈ కదలికకి వచ్చిన ధ్వనినే మనం ఓంకార నాదం అనుకున్నామనుకోండి. ఇది మొట్టమొదట వచ్చిన ధ్వని కాబట్టి, ప్రణవంతో సమస్త సృష్టి జరిగిందంటాము. మొట్టమొదట వచ్చిన ధ్వని కాబట్టి మిగితా అన్ని శబ్ధాలు దీని తరువాతే వచ్చాయంటాము. లేక ఇదే ఆది శబ్ధం కాబట్టి, దీని నుండే అన్ని శబ్దాలు, అన్ని అక్షరాలూ, అన్ని మాటలు, అన్ని భాషలు, అన్ని మంత్రాలు, అన్ని బీజాక్షరాలూ, మున్నగునవి పుట్టాయంటాము. అలాగే వేదాలు శ్రుతాలుకాబట్టి అవి కూడా ఒక ధ్వని నుంచీ పుట్టినవే కాబట్టి, అవికూడా ఓంకారం నుండీ పుట్టాయనే వాదనలు సమంజసంగా అనిపిస్తున్నాయి. ఉపనిషత్తుల ప్రకారం కూడా “ఓంకారస్సర్వవేదానాం మూలం” అలాగే “ఓంకార ప్రభవా దేవాః” అంటే సకల వేదాలు, సకల దేవతలు ప్రణవం నుండే పుట్టినట్లు తెలుస్తున్నది.
మరి టెశ్లా సైన్సు చెప్పే మాటకూడా ఇదే! బిగ్ బాంగ్ (హమ్మింగ్ లేక హిస్సింగ్ శబ్దం) తర్వాతే ఏదైనా అని! ఏ పదార్థమైనా అని! బిగ్ బాంగ్ శబ్దానికి పూర్వం ఉన్నదేదీ మనకు తెలియదని; తెలిసినా అవి " లాస్ ఆఫ్ ఫిజిక్స్ " తొ సరిపడవని సైన్స్ చెబుతోంది. అంటే, సైన్సు, మన శాస్త్రాలు ఈ విషయంలో సంపూర్ణ ఏకీభావాన్ని వ్యక్తం చేసాయి కనుక, ఇప్పుడు టెశ్లా విన్న శబ్ధం అన్నా, మన ఓంకారాం ఆన్నా కూడా రెండూ ఒకటే అని మనం గ్రహించవచ్చు.
4. ఓంకారం అవిచ్చిన్నమైనది :
"తైల ధారావ దచ్ఛిన్నం - దీర్ఘం ఘంటా నినాదవత్ ఆప్లుతం ప్రణవస్యాంతం - యస్తం వేద సవేదవిత్" ఈ ఓంకారోచ్చారణ ఒక నూనె ధారలాగా అవిచ్ఛిన్నంగా, ఘంటానినాదం వలె దీర్ఘంగా పలకగలిగిన వాడు నిజంగా వేద విదుడు అని దీని అర్థం. మరి టెస్లా విన్న శబ్దం ఇలా నిరంతరంగా వచ్చే అవిచ్చిన్నమైన శబ్దమే కదా!!? దీనికి కూడా ఆది అంతం లేదు కదా?
5. ఓంకార పఠనా విధానం:
ఓంకారాన్ని మూడు మాత్రలుగా పల్కాలట. అంటే “ ఓ ఓ ఓమ్ “ అని పల్కవచ్చును. ధ్యానం చేసేటప్పుడు అనేక మాత్రలలో “ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ … … … ఓమ్ “ అని అవిచ్చినంగా పలుకవచ్చునట . ఐతే అవిచ్చిన్నమైనా “ ఓ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ … … … … ” అని మాత్రం పలుకరాదని శ్రీ చినజియ్యరుస్వామివారి ఉపదేశం. దానికి కారణం వారు తెలుప లేదు కానీ … …. మనం ఊహించవచ్చును … … బ్రహ్మాండం పేలింది. అలా ఆ పేలుడితో మొదలయ్యిన ఆ శబ్దం ఇంకా వస్తూనే వుంది. వస్తూనే వుంటుంది. ఆ ఓం కారం మొదట “ ఓ ఓ ఓ ….. “ అంటూ మొదలయ్యి అలాగే సాగుతోంది. ఇంకా "మ్ " అనే నాదం రాలేదు. వస్తే ఆ ఓంకార నాదం అయిపోయినట్లే. అదే విశ్వానికి ఆఖరి గడియ అవ్వొచ్చును. చినజియ్యర్ స్వామివారు అందుకే అలా చెప్పివుంటారు. టెశ్లా విన్నటువంటి శబ్దం యొక్క గుణం కూడా దీనితో సరిపోతోంది…. మొదటినుంచీ వచ్చిన శబ్దం ఒకటే.. అది ఇంకా వస్తున్నది... అదే ఆ హిస్సింగ్ లేక హమ్మింగ్ శబ్దం!
6. ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే:
ఇదే మాటని మాండూక్యకారికలలో "సర్వస్య ప్రణవోహ్యాదిః - మధ్యమన్త స్తథైవచ
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా - వ్యశ్నుతే తదనంతరమ్" అని చెప్పబడింది. అంటే అంతటికీ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే అని. అంటే ఓంకారం తోటే (టెశ్లా హిస్సింగ్ శబ్దం తోటే) ఈ అనంత విశ్వ సృష్టి జరిగింది. జరుగుతోంది. ఎక్కడ ఆగుతుందో తెలియదు. అసలు ఆగుతుందో లేదో కూడా తెలియదు. అంటే ఈ శబ్దం అన్నివేళలా వుంది, వుంటోంది, వుంటుంది అనడం సమంజసమే.
7. ఓంకారం అఖండితం:
ఓం కారం (టెశ్లా విన్నశబ్ధం కూడా)…. “ ఓ ఓ ఓ ….. “ అంటూనే ఇంకా సాగుతూవుంటే, దాని అర్థం, ఓంకార నాదాన్ని ఎవ్వరూ పూర్తిగా వినలేదు, వినలేరు. మనం వింటే (ఒక వేళ విన గలిగితే) ఆ మద్యలోని “ … …. ఓ ఓ ఓ ….. … “ అనే శబ్దాన్ని మాత్రమే వింటున్నామన్న మాట. దానినే మరింత విడమరిస్తే మనం వినేది ఖండిత ఓంకారం మాత్రమే. కానీ ఓంకారం అఖండితం. ఆది, అంతం తెలియనిది; నిరంతరంగా వినిపించేది, అని మనకు తెలిసిపోయింది. మార్చినెల సుజనరంజనిలో ప్రఖ్య మధుబాబు గారు వ్రాసినట్లు – “ సముద్రం నుంచీ ఒక బక్కెట్టు నీరు తెచ్చి ఇది సముద్రం అంటే అది సముద్రం కాదు. అలాగే మనం వినే (అనే) ఓంకారం కూడా ఓంకారం కాదు” అని కావ్యకంథ వాసిష్ఠ గణపతి మునిని ఉదహరిస్తూ వారిచ్చిన ఓంకార స్వరూపాన్ని చదివితే, మన బ్రహ్మాండ విస్పోటనాశబ్ధంతో (హిస్సింగ్ శబ్దం) సరిగ్గా సరిపోతుంది.
అలాగే చినజియ్యరు స్వామి వారు చెప్పిన ఓంకార స్మరణావిధానం కూడా బ్రహ్మాండ విస్పోటనా శబ్దంతో సామరస్యత సరిగ్గా సరిపోతుంది. సృష్ట్యాదిలో ఉన్న మౌలిక మౌనాన్ని ఖండిస్తూ "ఓం" అనే శబ్దం (అక్షరం) పుట్టింది. దానినే ఒక్కొక్క యోగి ఒక్క విధంగా తమ తమ అనుభూతులను బట్టి రకరకాలుగా వర్ణించారేమో?
8. ఓంకారం అంటే సత్ పథార్థం:
“ఏకం సత్ విప్రా బహుధావిదంతి” అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” అని ఋగ్వేదం చెప్తోందట. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క సత్యపదార్థమే ప్రధమబిందువూ దాని నుండీ బహిర్గతమైన ఓంకారం. సమగ్ర జ్ఞానం ఎవరికి వుంటే వారికి ఈ ఓంకార తత్వం బోధపడుతుంది. ఆ సమగ్ర జ్ఞానమే “బిగ్ బాంగ్ తియరీ” అయివుండవచ్చును. దాని నుంచీ పుట్టిన ఓంకారం లేక ఈ “హమ్మింగ్ శబ్దమే” ఆ సత్ పథార్థము.
9. ఓంకారం సంసారంలో ఒక నావ:
"ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్ధింతరిష్యతి" అని విశ్వం అనే (సంసారాన్ని) సముద్రం దాటాలంటే ముఖ్యమైన నావ ఓంకారమే. అని విజ్ఞులు చెబుతున్నారు. అంటే ఈ ఓంకారమే అన్ని గ్రహాలనూ కలిపేది. గ్రహాంతర రవాణాకు ఇదొక మార్గమేమో మన ఆధునికులు పరిశీలించి చూడొచ్చు. ఉదాహరణకి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఆయిన్‌స్టీన్ చెప్పిన “టైమ్ ట్రావలర్ “ సిద్ధాంతం, వర్మ్ హోల్ సిద్ధాంతాలు దాదాపు ఇలాగే వుంటాయి. బిగ్ బాంగ్ తియరీ నిర్మాతలలో ఈతడు కూడా ఒకడు అని మనందరికీ తెలుసు.
10. ఓంకారం అన్నిటా వుంది:
"ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్యహృది సంస్థితం; సర్వ వ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి" అంటే సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే. గరుడపురాణంలో వైకుంఠాన గరుత్మంతునకు సాక్షాన్నారాయణుడు ఉపదేశించుట బట్టి మానవేతరులకు సైతం ఓంకారం గ్రాహ్యమే అని డా. అన్నదానం చిదంబర శాస్త్రిగారు చెబుతున్నారు.
ప్రధమాణువు నుండీ (బ్రహ్మాండం నుండీ) పుట్టినదే ప్రణవం. మనిషి భూమి పైన పుట్టి తనలో ఎలా మట్టినీ, నీటినీ స్వాభావికంగా కలిగివున్నాడొ, అలాగే ఈ బ్రహ్మాండం నుంచీ పుట్టిన ప్రతి ప్రాణీలోనూ (వస్తువులోనూ) ప్రణవధ్వని అంతర్లీనమై స్వాభావికంగా వుంటుంది. మళ్ళీ సైన్సు ఇచ్చిన అవగాహన కూడా ఇదే అవుతోంది కదా!!?
11. ఓంకార దర్శనానికి ఉపాసన అవసరం:
ఓంకారం సర్వ ప్రాణులకు సర్వవస్తువులకు స్వాభావికసిద్ధంగా చెందినది. అంటే ఈ ఓంకార తరంగాలు రేడియో తరంగాలైనప్పటికీ మానవుడికి ఈ తరంగాలను వినే సామర్ధ్యం స్వాభావికంగా వుంటుంది. మన ఆంటినాలను సరిగ్గా ట్యూన్ చేసుకోవాలి. అంతే ! దానినే ఉపాసన అంటామేమో? మహాతాపసులకు ఆ అదృష్టభాగ్యం లభిస్తుందేమో? మరొక విధంగా ఆలోచిస్తే (మన ఋషులు వ్రాసిన గ్రంధాలు చూస్తే) వారంతా గొప్పగొప్ప సైంటిస్టులలాగా అనిపిస్తారు. సైంటిస్టుల వద్ద ఈ రేడియో వేవులను వినడానికి కావలసిన పరికరాలు, విజ్ఞానం వుంటాయి కూడా. ఎలా ఐతేనేం ఋషులు ఈ ఓంకార నాదాన్ని వినగలిగారు, దాని గురించి మనకు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మనమే వారిని సరిగా అర్థం చేసుకోలేక, ఈ విషయాన్ని చాలా కాంప్లికేట్ చేసుకున్నామేమో?
12. ఓంకారం నాద బ్రహ్మాం:
అన్నదానం చిదంబర శాస్త్రిగారు చెప్పినట్లు “సృష్టి అంతా లయం అయిన పిదప మిగిలేది నాదబ్రహ్మం మాత్రమే. పంచభూతాలలో సూక్ష్మాంశ అయిన ఆకాశం యొక్క శక్తి నాద బ్రహ్మము. సృష్టికి ఆదియందు మూలకారణంగా ఉన్నదీ నాదబ్రహ్మమే. ఆ నాదబ్రహ్మమే ఓంకారం. బ్రహ్మాండము, దిక్కులు, రాత్రింబవళ్ళు ఏవీ లేని సృష్ట్యాది దశలో ఒక అవ్యక్త నాదం వినవచ్చింది. అదే ఓంకారం”. బిగ్ బాంగ్ తియరీ చెప్పేదీ, అలాగే టెశ్లా విన్నటువంటి శబ్దం కూడా దాని తాలూకుదే కదా!!?
13. యంత్ర శాస్త్రం:
యంత్ర శాస్త్రం ప్రకారం బీజాక్షరాలకు అంటే ఆయా అక్షరాలకు వున్న రూపాలనే వాటి యంత్రాలుగా వాడొచ్చునట. మనం మనకు తెలిసిన ఏ లిపిలో నైనా సరే ఆ అక్షరం వ్రాసుకుంటే అది ఆ బీజాక్షరానికి యంత్రమే అవుతుందట. అంటే కానీ అతి పురాతనమైన దేవనాగరిక లిపి అన్నిటా శ్రేష్టమంటున్నారు వడ్లమూడి వేంకటేశ్వరరావు గారు. అలాగే టిబెటియన్లు వ్రాసే ఓంకారం, ఇంగ్లీషువారు ఎలక్ట్రిక్ రెసిస్టేన్‌సుకి వ్రాసే ఓం సింబలూ ( Ω ) సారూప్యత కలిగి వుంటాయంటారు ప్రఖ్య మధుబాబుగారు. “అంటే ఇంగ్లీషువారి “ Ω “ అనే గుర్తుకూడా ఒక యంత్రమయ్యే అవకాశం వుంది. అంతేకాదు టెస్లా కనుగొన్న శబ్దం రేడియో తరంగాల వల్ల వచ్చింది. రేడియో తరంగాలు విద్యుత్చ్చక్తి లేకుండా రావు కాబట్టి, విద్యుత్తుకీ, ఓంకారానికీ వున్న సన్నిహిత సంబంధం అర్థమవ్వొచ్చు; అందుకే ఆ “ Ω” (ఓం) అనే గుర్తునే ఎలక్ట్రిసిటీ లో వాడటం ఒక సాధారణ కాకతాళీయం కాదు. ప్రకృతి నిరంతరం మనతో మాట్లాడుతోంది, మనమే వినడంలేదు. కొన్ని సంకేతాలు మనకు తెలియకుండానే అలా పుట్టేస్తాయి అంటారు వీరు”.
--- --- ---
రోజులు, సంవత్సరాలుగా నిరవదికంగా “ఓం” అనే అక్షరం పైన భాష్యం చెప్పగలరు మనవాళ్ళు. అవన్నీ విన్నాక, ఓంకారం అంటే ఏమో కాదు, మన టెశ్లా విన్న రేడియో తరంగాలే అంటే, అది మరీ అంత సింపుల్‌గా ఉండదేమో అని మనం కొట్టివేయడం చాలా సహజం? అంతే కాదు, ఆ ఓంకారాన్ని నీవు కూడా తేలికగా వినగలవు అంటే, మన విశ్లేషణా ఉత్సాహం మొత్తం ఒక్కసారిగా నీరు గారిపోదూ? వాటిపైన మన జరుపుకునే విశ్లేషణలు, చర్చలు, గట్రా ఏం కానూ? తేలికగా చెప్ప గలిగిన దానికి అంత క్లిష్ట పరచే పెద్దపెద్ద భాష్యాలు అవసరమా? తెలియదు! కానీ మన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఇలా సగం సగం అర్థాలు తెలిపి ఊరించే శ్లోకాలు ఎన్నో వుంటాయి. సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో మనం విషయాన్ని చెప్పలేకున్నామా, లేక విషయాన్ని తెలిసి కూడా దాచడానికి ప్రయత్నిస్తున్నామా? వాటి పరమార్థం ఏమిటొ పై వాడికే తెలియాలి. కానీ ఎన్నో నిగూఢ రహస్యాలను దాచుకుని వుంటుంది మన ఆధ్యాత్మిక సాహిత్యం. అన్వేషణ అవసరం!! తపన ముఖ్యం!! నిరుత్సాహ పడకుండా తెలుసుకుందాం!! ప్రయత్నిద్దాం!! అన్వేషణలను ప్రోత్సహిద్దాం!!
ఇలాంటి వైజ్ఞానిక విషయాలను మరింత సరళతరం చేసే ఉద్దేశ్యంతో ప్రఖ్యాత రచయిత డా.వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈ మాసం నుంచీ ఒక సరికొత్త శీర్షికను మనందరి కోసం ప్రారంభించ బోతున్నారు. విశ్వస్వరూపం అనే ఈ శీర్షిక, ప్రతి మాసం మన విశ్వంలో దాగి వున్న అనేక విషయాలను వెలికి తీసి, వైజ్ఞానిక పరంగా విశ్లేషిస్తుంది. దానితో మన అవగాహన పెంచుకుందాం! జ్ఞానమే ఆనందం అని దాన్ని అందరితో కలసి పంచుకుందాం!!!
మీ
రావు తల్లాప్రగడ
రోజులు, సంవత్సరాలుగా నిరవదికంగా “ఓం” అనే అక్షరం పైన భాష్యం చెప్పగలరు మనవాళ్ళు. అవన్నీ విన్నాక, ఓంకారం అంటే ఏమో కాదు, మన టెశ్లా విన్న రేడియో తరంగాలే అంటే, అది మరీ అంత సింపుల్‌గా ఉండదేమో అని మనం కొట్టివేయడం చాలా సహజం? అంతే కాదు, ఆ ఓంకారాన్ని నీవు కూడా తేలికగా వినగలవు అంటే, మన విశ్లేషణా ఉత్సాహం మొత్తం ఒక్కసారిగా నీరు గారిపోదూ? వాటిపైన మన జరుపుకునే విశ్లేషణలు, చర్చలు, గట్రా ఏం కానూ? తేలికగా చెప్ప గలిగిన దానికి అంత క్లిష్ట పరచే పెద్దపెద్ద భాష్యాలు అవసరమా? తెలియదు! కానీ మన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఇలా సగం సగం అర్థాలు తెలిపి ఊరించే శ్లోకాలు ఎన్నో వుంటాయి. సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో మనం విషయాన్ని చెప్పలేకున్నామా, లేక విషయాన్ని తెలిసి కూడా దాచడానికి ప్రయత్నిస్తున్నామా? వాటి పరమార్థం ఏమిటొ పై వాడికే తెలియాలి. కానీ ఎన్నో నిగూఢ రహస్యాలను దాచుకుని వుంటుంది మన ఆధ్యాత్మిక సాహిత్యం. అన్వేషణ అవసరం!! తపన ముఖ్యం!! నిరుత్సాహ పడకుండా తెలుసుకుందాం!! ప్రయత్నిద్దాం!! అన్వేషణలను ప్రోత్సహిద్దాం!!
ఇలాంటి వైజ్ఞానిక విషయాలను మరింత సరళతరం చేసే ఉద్దేశ్యంతో ప్రఖ్యాత రచయిత డా.వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈ మాసం నుంచీ ఒక సరికొత్త శీర్షికను మనందరి కోసం ప్రారంభించ బోతున్నారు. విశ్వస్వరూపం అనే ఈ శీర్షిక, ప్రతి మాసం మన విశ్వంలో దాగి వున్న అనేక విషయాలను వెలికి తీసి, వైజ్ఞానిక పరంగా విశ్లేషిస్తుంది. దానితో మన అవగాహన పెంచుకుందాం! జ్ఞానమే ఆనందం అని దాన్ని అందరితో కలసి పంచుకుందాం!!!
మీ
రావు తల్లాప్రగడ
chaala vivaram ga undi andi - entho samayam - aasakti - parisodhana avasaram iaalnti vivaraalu andinchdaaniki - dhanyulam.
ReplyDelete- Satya Srikar Bharatam